BJP MP : ప్రచారంలో యువతికి ముద్దు పెట్టిన బీజేపీ ఎంపీ అభ్యర్థి

పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఓ బీజేపీ ఎంపీ అభ్యర్థి ప్రచారంలో భాగంగా ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాల్దా బీజేపీ ఎంపీ అభ్యర్థి ఖగేన్ ముర్ము ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువతి బుగ్గపై ముద్దు పెట్టారు. ఈ ఘటన ఆ రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. బెంగాలీ మహిళలపై వేధింపులు ఆపండి అని కొందరు విమర్శిస్తున్నారు.
ఇది వివాదం కావడంతో ఎంపీ ఖగేన్ స్పందిస్తూ ఘటనపై స్పష్టతనిచ్చారు. ‘‘ఆమెను నా కుమార్తెలా భావించా. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటి? కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారు. ఇలాంటి చిత్రాలను వక్రీకరించి వ్యక్తులు, పార్టీల పరువుకు భంగం కలిగిస్తున్నారు. వారిపై (టీఎంసీ) ఫిర్యాదు చేస్తాం’’ అని ఖగేన్ ముర్ము వెల్లడించారు.
మరోవైపు, యువతి కూడా దీనిపై స్పందిస్తూ ఎంపీకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. ‘‘సొంత కుమార్తెలా భావించి ఆయన ముద్దు పెట్టుకుంటే అందులో సమస్య ఏంటి? ఇలాంటి ఘటనలను సోషల్ మీడియాలో వైరల్ చేసే వారిది చెత్త మనస్తత్వం. ఆ ఫొటో తీసిన సమయంలో మా అమ్మానాన్నా కూడా అక్కడే ఉన్నారు’’ అని ఆమె చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com