WAR: సరిహద్దుల్లో బ్లాక్ అవుట్.. భారత్‌లో హై అలెర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో అప్రమత్తం

ఆపరేషన్‌ సింధూర్‌ దాడితో పిచ్చెక్కిపోయిన పాక్‌ సైన్యం విచ్చలవిడి కాల్పులకు తెగబడుతోంది. ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ బ్లాక్ అవుట్ ప్రకటించింది. భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నాలుగు రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా రాష్ట్రాల్లో అధికారులకు సెలవులు రద్దు చేశారు. ఎవరూ జిల్లా దాటి వెళ్లవద్దంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిస్సైల్స్ దాడి నేపథ్యంలో చాలా చోట్ల బ్లాక్ అవుట్ విధించారు. కొన్ని చోట్ల ఇంటర్నెట్ సేవలను బంద్ చేశారు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో రాత్రి 1:45 గంటల ప్రాంతంలో మూడు వేర్వేరు చోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దీంతో బ్లాక్ అవుట్ ప్రకటించారు. జమ్మూ విమానాశ్రయం సహా పలు కీలక ప్రాంతాలవైపు డ్రోన్లు వచ్చాయి. దీంతో ప్రజలంతా వెంటనే ఇళ్లలోకి వెళ్లిపోయారు. దుకాణాలను మూసివేశారు. గగనతల రక్షణ వ్యవస్థ ఈ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చేసింది.

పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలో హైఅలర్ట్‌ విధించారు. ఇండియా గేట్‌ సహా అన్ని ప్రదేశాలను మూసివేశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతను పెంచారు. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో జనసంచారం నిషేధించారు. ప్రజలెవరూ బయటతిరగవద్దని ఆదేశించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. అత్యవసర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో.. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ అధికారికీ సెలవులు ఇవ్వద్దని స్పష్టం చేసింది. మరోవైపు జమ్మూ సిటీలో విద్యుత్తు సరఫరాను అధికారులు నిలిపేశారు. కమ్యూనికేషన్‌ వ్యవస్థలు మూగబోయాయి. జమ్మూలో పలు సైనిక కేంద్రాలున్నాయి. విమానాశ్రయంవద్ద భారీ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఉద్రిక్తతల దృష్ట్యా అఖ్నూర్, కిశ్త్‌వాద్, సాంబా సెక్టార్‌లలో అధికారులు పూర్తిగా విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. జమ్మూ జిల్లా వ్యాప్తంగా సైరన్లు మోగిస్తున్నారు.

Tags

Next Story