Central Government : బనకచర్ల ప్రాజెక్ట్‌పై 12 మందితో కేంద్రం టెక్నికల్ కమిటీ

Central Government : బనకచర్ల ప్రాజెక్ట్‌పై 12 మందితో కేంద్రం టెక్నికల్ కమిటీ
X

బనకచర్ల ప్రాజెక్ట్‌పై తలెత్తిన వివాదం నేపథ్యంలో, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా వ్యవహారాలను పరిశీలించడానికి 12 మంది సభ్యులతో కూడిన టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసే దిశగా కేంద్ర జలసంఘం (CWC) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ 12 మంది సభ్యుల కమిటీ బనకచర్ల ప్రాజెక్టు డిజైన్, నిర్మాణ విధానం, నీటి వినియోగ ప్రణాళికలపై సమగ్రంగా అధ్యయనం చేయనుంది. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డుకు ఈ ప్రాజెక్టు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకుంటుందని సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నీటి విభజనలో న్యాయం జరిగేలా ఒక రోడ్‌మ్యాప్ తయారు చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. ఈ కమిటీలో సభ్యుల పేర్లను పంపాలని కేంద్ర జలసంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలకు సమాచారం అందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి. సాయిప్రసాద్, జలవనరుల శాఖ సలహాదారు బి. వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ఎం. నరసింహమూర్తి పేర్లను కేంద్ర జలసంఘానికి పంపే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిర్మించాలని ప్రతిపాదించింది. దీని ద్వారా గోదావరి నదిలోని మిగులు జలాలను రాయలసీమతో పాటు ఇతర జిల్లాలకు తరలించాలని భావిస్తోంది. అయితే, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందని వాదిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా నిలవరించాలని కోరారు. ఈ వివాదం నేపథ్యంలో, కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ గతంలో బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. సీడబ్ల్యూసీ అనుమతులు తీసుకోవాలని సూచించింది.

Tags

Next Story