NTR తెలుగు ప్రజల ఆస్తి: చంద్రబాబు

ఎన్టీఆర్ ఆయన కుటుంబానికే సొంతం కాదని, ఆయన తెలుగు ప్రజల ఆస్తి అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని కైతలాపూర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు ఎన్టీఆర్ వ్యక్తి కాదని ఓ శక్తి అని కొనియాడారు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజును అమెరికాలో తెలుగు హెరిటేజ్ డేగా ప్రకటించారని, తెలుగు జాతికి ఎన్టీఆర్ తీసుకువచ్చిన గుర్తింపుకు ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలని అన్నారు. ఎన్టీఆర్ సేవలకు గానూ భారతరత్న ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ అనే వెలుగు వెయ్యేళ్లకు సరిపడా కాంతినిచ్చిందని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ తన జన్మని తెలుగు జాతికి అంకితం ఇచ్చిన మహానుభావుడన్నారు. ఎన్నో సాహసోపేతమైన పాత్రలు పోషించారని ఆయన మహోన్నత నటన విశ్వవ్యాప్తమైందన్నారు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక గ్రంథాలయమన్నారు బాలకృష్ణ.
ఎన్టీఆర్ సేవలు మరువలేనివని బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. పేదల సంక్షమమే లక్ష్యంగా పని చేశారని గుర్తు చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని మహోన్నత శిఖరాలకు తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు టీటీడీపీ అధ్యక్షుడు కాసాని.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com