Free Ration : పేదలకు 10 కిలోల ఉచిత రేషన్ ఇస్తాం: ఖర్గే

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశంలోని పేదలకు బీజేపీ ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ పరిమాణాన్ని రెట్టింపు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు. కాంగ్రెస్ ఆహార భద్రతా చట్టాన్ని తెచ్చిందని, పేదల కోసం మీరేమీ చేయలేదని మోదీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. బధవారం సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో కలసి ఖర్గే మీడియాతో మాట్లాడారు.
‘మీరు 5కిలోలు ఇస్తున్నారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడితే మేం పేదలకు 10కిలోల రేషన్ ఇస్తాం. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే దీన్ని అమలు చేశాం కాబట్టే గ్యారంటీగా చెబుతున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వీడ్కోలు పలికేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఖర్గే చెప్పారు. జూన్ 4న ఇండియా కూటమి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమంటే దళితులు, గిరిజనులు, పేదలు, రైతులకు ద్రోహం చేసినట్లేనని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు. ‘ప్రజలకు ఆహారం, ఉద్యోగాలు దొరకడం లేదు. కానీ ప్రధానికి తన పదవి తప్ప ఇంకేం పట్టవు. సోనియమ్మ తృణప్రాయంగా వదిలేసిన ఆ అధికారంపైనే బీజేపీ వాళ్ల చూపు ఉంది. అలాంటివారిని మళ్లీ అధికారంలోకి తీసుకురాకూడదు’ అని రాయబరేలిలో తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com