Congress : ఐటీ నోటీసులపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన

Congress : ఐటీ నోటీసులపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఆందోళన

ఎన్నికల వేళ తమను ఐటీ నోటీసుల పేరుతో వేధిస్తున్నారని కాంగ్రెస్ (Congress) ఆరోపిస్తోంది. రూ.1,823.08 కోట్లు చెల్లించాలని ఆదాయపన్ను శాఖ నుంచి కాంగ్రెస్‌కు శుక్రవారం నోటీసులు అందాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా కుంగదీసేందుకు అధికార బీజేపీ 'పన్ను ఉగ్రవాదం'కు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌తో కలిసి పార్టీ కోశాధికారి అజయ్‌ మాకెన్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆదాయపన్ను చట్టాలను బిజెపి తీవ్రంగా ఉల్లంఘిస్తోందన్నారు.

ఎన్నికలు జరగనున్న అత్యంత కీలక సమయంలో ఐటీ శాఖను తమపై ప్రయోగించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడింది. ఇప్పటికే రూ.135 కోట్లు తమ ఖాతా నుంచి బలవంతంగా తీసుకున్నారని.. తాజాగా మరో 1,823.08 కోట్లు చెల్లించాలంటూ నిన్న నోటీసులు ఇచ్చారని పేర్కొంది. ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని తక్షణమే ఆపాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. "ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్" ద్వారా భారతీయ జనతా పార్టీ (బిజెపి) 8,200 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, "ప్రీ-పెయిడ్, పోస్ట్-పెయిడ్, పోస్ట్ రైడ్ లంచాలు, షెల్ కంపెనీల" మార్గాన్ని ఉపయోగించిందని రమేష్ ఆరోపించారు.

బిజెపి (BJP) "పన్ను ఉగ్రవాదం"లో నిమగ్నమైందని జైరాం ఆరోపించారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా కుంగదీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే తాము కుంగిపోవడం లేదని రమేష్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రచారం కొనసాగుతుందని, తమ హామీలను దేశ ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ త్వరలోనే దీనిపై సుప్రీంలో ఫైట్ చేయనుంది. ఐతే.. కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తిప్పికొడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story