Digvijay : 30 ఏళ్ల తర్వాత తొలిసారిగా పోటీలో దిగ్విజయ్

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ 30 ఏళ్ల విరామం అనంతరం ఎంపీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చివరిగా 1991లో రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి ఆయన గెలిచారు. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ అదే స్థానం నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున గత 2సార్లు అక్కడ గెలిచిన రోడ్మల్ నాగర్ డిగ్గీని ఢీకొడుతున్నారు. 2019లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీ దక్కించుకున్న నాగర్‌ను ఓడించేందుకు డిగ్గీ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
1993 నుంచి 2003 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి దిగ్విజయ్ స్వయంగా రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ, అతను తన ప్రకటనలతో ఎప్పుడు రాజకీయాల్లో చురుక్కుగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో సహా తరచుగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిగ్విజయ్ సింగ్ తాజాగా సోషల్ మీడియా ‘ఎక్స్’ హ్యాండిల్‌లో రాజ్‌గఢ్ ప్రజలకు భావోద్వేగ లేఖ రాశారు. దానిలో ఆయన ‘నేను నా తండ్రి మరణించాక ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుని రాజ్‌గఢ్ వచ్చాను. నాడు ఇక్కడి ప్రముఖుడు కస్తూర్ చంద్ జీ కఠారీని కలుసుకున్నాను. అప్పుడు ఆయన నాతో ప్రతీ వ్యక్తి జీవితంలో 12 లక్ష్యాలను సాధించాలని పేర్కొన్నారు.
కుటుంబాన్ని పోషించేంతటి సంపాదన ప్రతీ వ్యక్తికి అవసరమని, అలాగే పొదుపు చేయాలని, నగలు కొనుగోలు చేయాలని ఆయన తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలని, ఇవన్నీ సమకూరితే అదృష్టవంతుడివని, అప్పుడు పేరు సంపాదించుకోవాలని వివరించారు. నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాగే ప్రయత్నించాను. అందులో నేను ఎంతవరకూ సక్సెస్ అయ్యానో నేనే అంచనా వేయలేను. సామాన్యులు మాత్రమే అలా చేయగలరు. ఇవి నా జీవితంలో చివరి ఎన్నికలు. వీటిలో నేను ఎంతవరకు విజయం సాధిస్తానో మీరే నిర్ణయిచాలి’ అని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com