Digvijay Singh : బీజేపీపై దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
నీట్ పరీక్ష లోటుపాట్లు, ప్రశ్నాపత్రాల లీకేజ్, యూజీసీ-నెట్ పరీక్ష రద్దు వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ ( Digvijay Singh ) సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష రాసిన 14 లక్షల మంది విద్యార్థుల్లో 5 నుంచి 10 శాతం ముస్లింలు ఉంటారని, మిగిలిన వారంతా హిందువులేనని అన్నారు. హిందువులను కాపాడే బాధ్యత తీసుకున్న వారంతా ఇప్పుడు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇది హిందూ విద్యార్థులకు అన్యాయం చేసినట్టు కాదా అని దిగ్విజయ్ సింగ్ కాషాయ పాలకులను నిలదీశారు. దీనిపై బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్, ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఇక అంతకుముందు నీట్ పరీక్ష అవకతవకలపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ బీజేపీ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.
నీట్ అక్రమాలపై విద్యార్థులు నిరసన బాట పట్టారని అన్నారు. యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్ కేంద్రంగా ఎడ్యుకేషన్ స్కామ్ లు జరిగాయని రాహుల్ గాంధీ చెబుతున్నారని, ఈ మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలేనని జైరాం రమేష్ గుర్తుచేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com