Nitin Gadwari : రోడ్లు సరిగా లేకుంటే టోల్ వసూలు చేయొద్దు: గడ్కరీ

నాణ్యమైన సేవలు అందించనప్పుడు టోల్ వసూలు చేస్తే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadwari ) అన్నారు. రహదారులు సరిగా లేకుంటే టోల్ ఛార్జీలు వసూలు చేయొద్దని హైవే సంస్థలకు సూచించారు. ‘మనం టోల్ వసూలుపై చాలా ఆత్రుతతో ఉన్నాం. కానీ రోడ్లు సరిగా ఉన్న చోటే ఫీజులు వసూలు చేయాలి. గుంతలు, మట్టితో ఉండే అధ్వానమైన రోడ్లకు టోల్ వసూలు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది’ అని తెలిపారు.
‘‘మీరు మంచి సేవలు అందించలేనప్పుడు టోల్ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించరు. చాలామంది ఇప్పటికే సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు అందివ్వలేనప్పుడు టోల్ వసూలు చేయకూడదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది’’ అని గడ్కరీ అన్నారు. టోల్ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా చూడాలని నేషనల్ హైవే ఫీల్డ్ ఆఫీసర్లకు సూచించారు.
గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (జీఎన్ఎస్ఎస్)- ఆధారిత ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఈటీసీ) సిస్టమ్‌ను ఇప్పటికే ఉన్న ఫాస్ట్‌ట్యాగ్ పర్యావరణ వ్యవస్థలో అమలు చేయాలని ఎన్హెచ్ఏఐ యోచిస్తోంది. గోప్యతా సమస్యలను పరిగణనలోకి తీసుకుని మొదట్లో ప్రైవేట్ వాహనాలపై, వాణిజ్య వాహనాలపై దీన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com