ED : ఈడీ అధికారులుగా నటిస్తూ.. 300మంది ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులుగా నటిస్తూ ప్రభుత్వ అధికారుల నుండి డబ్బు వసూలు చేసినందుకు ఒడిశా (Odisha) పోలీసులు ఇద్దరు సోదరులను ధెంకెనాల్ జిల్లాలో అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులు - తరినిసేన్ మోహపాత్ర (30), బ్రహ్మశంకర్ మహపాత్ర (27)లను రాష్ట్ర పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మార్చి 16న దెంకనల్ పట్టణంలోని వారి ఇంటి నుండి అరెస్టు చేసినట్లు పోలీసులు మార్చి 17న తెలిపారు.
నిందితులు భారీ మొత్తంలో రుణం తీసుకున్నారని, రుణదాతలకు తిరిగి చెల్లించలేక పోయారని, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసేందుకు వీరిద్దరూ పథకం పన్నారని పోలీసులు చెప్పారు. ‘‘ఈడీ భువనేశ్వర్‌కు అదనపు డైరెక్టర్’’గా నటిస్తూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 300 మంది అధికారులను ఫోన్‌లో సంప్రదించారన్నారు. కొందరు అధికారుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో విజయం సాధించగా, మొత్తంగా రూ.16 లక్షలకు పైగా చెల్లింపులు జరిగాయి. వారు PhonePe, GPay ద్వారా చెల్లింపులు తీసుకునేవారు. అధికారులకు నకిలీ క్లియరెన్స్ లెటర్స్ జారీ చేశారని తెలిపారు.
ఛత్రపూర్ సబ్ కలెక్టర్ దేబదత్తా మొహంతా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిని అరెస్టు చేసినట్లు ఎస్టీఎఫ్ అధికారి తెలిపారు.వారి నుంచి ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ఐదు మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్‌బుక్‌లు, చెక్కులు, నకిలీ ఐడీ కార్డులు, 17 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com