Arvind Kejriwal : ఈడీ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్

Arvind Kejriwal : ఈడీ కేసులో కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్
X

లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ(ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు రిలీఫ్ దక్కింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో ఏప్రిల్‌ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈడీ, సీఎం తరఫు వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా ఆయన మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు చెప్పింది.

బెయిల్ దక్కినా జైలులోనే..

అయితే, ఈడీ కేసులో బెయిల్‌ దక్కినా సీబీఐ కేసులో అరెస్టయినందున కేజ్రీవాల్ తిహార్ జైలులోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈ ఏడాది మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయగా ఆయన జైలు నుంచి రిలీజ్ అయ్యారు. బెయిల్ గడువు ముగియడంతో జూన్‌ 2న తిరిగి లొంగిపోయారు.

ఈ కేసులో జూన్‌ 20న రౌస్‌ అవెన్యూ కోర్టు ఢిల్లీ సీఎంకు సాధారణ బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై ఈడీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. అనంతరం జూన్‌ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. ఇదే వ్యవహారానికి సంబంధించి సీబీఐ కేసులోనూ జూన్ 21న కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. జూన్‌ 27 నుంచి ఆయన సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

Tags

Next Story