2050 నాటికి భారత్‌లో వృద్ధుల సంఖ్య డబుల్!
భారత్‌లో వృద్ధుల జనాభా 2050 నాటికి రెండింతలు అవుతుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) వెల్లడించింది. 60ఏళ్లుపైబడిన వృద్ధుల సంఖ్య 346 మిలియన్లకు చేరుతుందని వివరించింది. 2050 నాటికి దేశంలో 50% పట్టణాలే ఉంటాయని అంచనా వేసింది. వృద్ధాప్యంలో మహిళలు ఒంటరితనం, పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా ఉందని UNFPA భారత అధ్యక్షురాలు ఆండ్రియా వోజ్నార్ పేర్కొన్నారు.
అరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య 2050 నాటికి 34.6 కోట్లకు చేరుతుందని ఓజ్‌నర్ తెలిపారు. భారత్‌లో 10-19 సంవత్సరాల మధ్య వయసున్న వారి సంఖ్య 25.2 కోట్లుగా ఉన్నదని ఆమె చెప్పారు. దేశాన్ని సమ్మిళిత వృద్ధి దిశగా ముందుకు నడిపించాలంటే ఆరోగ్యం, విద్య, ఉద్యోగ శిక్షణపై పెట్టుబడులు పెంచాలని, లింగ సమానత్వాన్ని సాధించాలని సూచించారు.
2050 నాటికి దేశంలో యాభై శాతం పట్టణ ప్రాంతంగానే ఉంటుందని అంటూ మురికివాడలను అభివృద్ధి చేయడానికి, వాయు కాలుష్యాన్ని అడ్డుకోవడానికి, పర్యావరణ సంబంధమైన సమస్యలను పరిష్కరించడానికి స్మార్ట్ సిటీలు నిర్మించాలని, పటిష్టమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణాలు చేపట్టాలని అన్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com