Emotional Moments : కుబేరుడు ముకేశ్ కంట కన్నీళ్లు.. కొడుకు స్పీచ్ విని తట్టుకోలేక..!
కన్నీళ్లకు పేదా, పెద్దా తేడా ఉండదు. ఎమోషన్ బట్టి బయటకు వస్తుంటాయి. చిన్న కొడుకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో గ్రాండ్‌గా జరుగుతున్నాయి. అంతా సందడిగా సాగిపోతున్న ఈ వేడుకల్లో అనంత్ అంబానీ స్పీచ్ ఒక్కసారిగా అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. తన ఆరోగ్య సమస్యల గురించి అనంత్ మాట్లాడుతూ.. ఎమోషనల్ అయ్యారు.
కొడుకు మాట్లాడుతున్న టైంలో ముకేశ్ అంబానీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 1న ప్రారంభమైన ఈ ఈవెంట్ మార్చి 3 దాకా కొనసాగనుంది. ''నన్ను నా ఫ్యామిలీ చాలా ప్రత్యేకంగా చూసింది. అయినా నా జీవితం పూలపాన్పు కానే కాదు. ఎన్నోసార్లు ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నాను. అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఎల్లప్పుడూ మా అమ్మ, నాన్న అండగా నిలబడ్డారు. నాకు బాధ కలగకుండా ఉండేందుకు ఏమేం చేయాలో వాళ్లు అన్నీ చేశారు. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్‌గా జరుగుతోందంటే అందుకు కారణం మా అమ్మే. ఈ ఈవెంట్ కోసం మా అమ్మ కొద్ది నెలలుగా రోజుకు 18 గంటల పాటు పని చేస్తోంది. ఆమె వల్లే ఇదంతా సాధ్యమైంది. థాంక్యూ అమ్మా'' అని అనంత్ అంబానీ చెబుతున్నప్పుడు ముకేశ్ కంట నీళ్లు తిరిగాయి. ఆయన కళ్లు తుడుచుకోవడం కనిపించింది.
ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్ మొదటి రోజు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. పాప్‌సింగర్ రిహాన్నా షో ఈసందర్భంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముకేశ్ అంబానీ, నీతా అంబానీ ఓ బాలీవుడ్ పాటకు యాక్టింగ్ చేసి అందరినీ అలరించారు. ఈ ఈవెంట్‌కు ప్రపంచంలోని అత్యంత సంపన్నులతో సహా 1,000 కంటే ఎక్కువ మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. ప్రముఖ ఆహ్వానితులలో బిల్ గేట్స్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ వంటి ప్రముఖ బాలీవుడ్ తారలు ఉన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com