Fee Reversal Ordered : ప్రైవేట్ స్కూళ్లకు మధ్యప్రదేశ్ సర్కార్ సంచలన ఆదేశాలు
విద్యార్థుల నుంచి అక్రమంగా వసూలు చేసిన రూ.కోట్ల మేర ఫీజులను తిరిగి చెల్లించాలని పలు ప్రైవేటు పాఠశాలలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించి ఆ స్కూళ్లు.. ఫీజులను పెంచినట్లు తేలడంతో ఈమేరకు చర్యలకు ఉపక్రమించింది.
జబల్పూర్ లోని పలు ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నట్లు జిల్లా విద్యా శాఖకు ఫిర్యాదులు అందాయి. ఓ కమిటీని ఏర్పాటు చేసి.. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది సర్కారు. ఈ క్రమంలోనే సంబంధిత స్కూళ్ల ఖాతాలను పరిశీలించగా.. 2018-19 నుంచి 2024-25 మధ్యకాలంలో 10 పాఠశాలలు 81 వేలకుపైగా విద్యార్థుల వద్ద నుంచి రూ.64.58 కోట్లమేర ఫీజులను అక్రమంగా వసూలు చేసినట్లు తేలింది. దీన్ని తప్పు పడుతూ.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
10 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచాలనుకునే పాఠశాలలు నిబంధనల ప్రకారం జిల్లా యంత్రాంగం అనుమతి పొందాల్సి ఉంటుంది. 15 శాతానికి మించి ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నుంచి అనుమతి అవసరమని ఓ అధికారి తెలిపారు. అయితే.. ఈ స్కూళ్లు అనుమతి తీసుకోకుండానే ఫీజులు పెంచినట్లు వెల్లడించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com