Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ విడుదల.. జైలు బయట ఘనస్వాగతం

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు ( Hemant Soren ) ఎట్టకేలకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సోరెన్ కు అయిదు నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. దాంతో ఆయన బిర్సా ముండా జైలు నుంచి హేమంత్ సోరెన్ విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు.
జైలు నుంచి ఆయన బయటకు రాగానే పెద్ద సంఖ్యలో జేఎంఎం మద్దతుదారులు అనుకూలంగా నినాదాలు చేశారు. న్యాయవ్యవస్థతోపాటు తమకు మద్దతు తెలిపిన ప్రజలకు హేమంత్ భార్య కల్పన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13న బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సోరెన్ కు ఊరట కలిగిస్తూ తీర్పునిచ్చింది. రూ.50 వేల బెయిల్ బాండ్ తో పాటు ఇద్దరి పూచీకత్తుతో సోరెన్ ను బెయిల్ పై విడుదల చేయాలని తీర్పు చెప్పింది.
ఈ ఏడాది జనవరిలో ఈడీ ఆయనను అరెస్టు చేసింది. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించడం ద్వారా అక్రమ ఆదాయాన్ని సంపాదించారని ఈడీ ఆరోపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com