Bridge Collapse : బిహార్‌లో మళ్లీ కుంగిన నాలుగో వంతెన

బిహార్ రాష్ట్రంలో వరుస వంతెన ప్రమాదాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాజాగా కిషన్ గంజ్ జిల్లాలో కంకయీ ఉపనదిపై నిర్మించిన ఓ వంతెన కుంగిపోయింది. దీంతో బహదుర్ గంజ్, దిఘాల్ బ్యాంక్ బ్లాక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో 10 రోజుల వ్యవధిలో ఇది నాలుగో బ్రిడ్జి కుంగిన ఘటన. కంకయీ, మహానంద నదులను కలిపి మడియా ఉపనదిపై 2011లో 70 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మించారు. నేపాల్ లోని పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురు స్తుండటంతో నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. ప్రవాహం ధాటికి వంతెన పిల్లర్లు కుంగి పోయాయి అని జిల్లా మెజిస్ట్రేట్ తుషార్ సింగ్లా తెలిపారు. బ్రిడ్జికి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేసి, రాకపోకలను నిలిపివేసినట్లు చెప్పారు.
రహదారుల శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతకుముందు తూర్పు చంపారన్, సివాన్, అరారియా జిల్లాల్లో వంతెన సంబంధిత ఘటనలు సంచలనం రేపాయి. పది రోజులు వ్యవధిలోనే రాష్ట్రంలో నాలుగు వంతెనలు కూలిపోవడంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com