New Political Party : గాంధీ జయంతి రోజు పీకే కొత్త పార్టీ

New Political Party : గాంధీ జయంతి రోజు పీకే కొత్త పార్టీ
X

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 2.. గాంధీ జయంతి రోజున తన రాజకీయ పార్టీ పేరు, జెండా, విధివిధానాలను వెల్లడించనున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు బీహార్ లో గత రెండేళ్లుగా ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ యాత్ర నిర్వహిస్తున్నారు.

అక్టోబర్ 2 న రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రారంభించేందుకు పీకేగా ప్రసిద్దులైన ప్రశాంత్ కిషోర్ సన్నాహాలు చేస్తున్నారు. అప్పటికి జన్ సురాజ్ యాత్ర ప్రారంభించి సరిగ్గా రెండేళ్లు పూర్తవుతాయి. రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 248 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. పార్టీ వ్యవహారాలను నిర్వహించేందుకు త్వరలో 21 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ను ఏర్పాటు చేయనున్నారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించిన తర్వాత కొంత కాలం పాటు రాజకీయ వ్యూహాలను వదిలేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించాడు. రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ 2014 లో బీజేపీ విజయంలో, 2019లో వైసీపీ విజయంలో, 2021 లో టీఎంసీ, డీఎంకే గెలుపులో కీలక పాత్ర పోషించారు.

2022లో బీహార్ జన్ సురాజ్ యాత్రను ప్రారంభించాడు. ఈ యాత్రలో కిషోర్ రాష్ట్రంలోని 14 జిల్లాల్లో దాదాపు 500 కిలోమీటర్లు కాలినడకన పర్యటించారు. మరో 10 జిల్లాల్లో కారులో ప్రయాణించి కవర్ చేశారు. కులం లేదా మతం ఆధారంగా ఓటు వేయొద్దని, చిన్నారుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు ప్రశాంత్ కిశోర్.

Tags

Next Story