Floods: వరదలతో నేపాల్ అతలాకుతలం.. జాతీయ సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

భారీ వర్షాలు, వరదలతో నేపాల్ అతలాకుతలమైంది. వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది ఇప్పటివరకు 114 మందిని సురక్షితంగా రక్షించారు. రుతుపవనాల ప్రభావంతో శుక్రవారం నుంచి దేశంలోని ఏడు ప్రావిన్స్‌లలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.
ప్రకృతి ప్రకోపానికి కోషి ప్రావిన్స్‌లోని ఇలమ్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఇలమ్‌లో కొండచరియలు విరిగి ఓ నివాసంపై పడటంతో ఆ ఇల్లు పూర్తిగా కుప్పకూలి, అందులో నిద్రిస్తున్న ఆరుగురు కుటుంబ సభ్యులు మరణించారని అధికారులు వెల్లడించారు.
ఇక ఖొటంగ్, రౌటహట్ జిల్లాల్లో పిడుగుపాటుతో ఐదుగురు మృతి చెందారు. వరదలతో అనేక గ్రామాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. రహదారులు తెగిపోయాయి. వందలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని నేపాల్ ప్రభుత్వం సోమవారం నాడు జాతీయ సెలవు దినంగా ప్రకటించింది.
భారత ప్రధాని మోదీ స్పందన
నేపాల్‌ను కుదిపేసిన ఈ ప్రకృతి విపత్తుపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “నేపాల్‌కు అవసరమైన సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ కష్ట సమయంలో మిత్రదేశమైన నేపాల్‌కు పూర్తి మద్దతుగా నిలుస్తాం” అంటూ మోదీ 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com