Indiramma Homes : ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్ల ( Indiramma Homes ) కోసం ప్రజల నుంచి వచ్చిన 82.82 లక్షల దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. అలాగే వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించింది. ఏడాదికి 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ లెక్కన అయిదేళ్లలో 22.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అవకాశం ఉంది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్‌గా మారింది. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పుడు వాటి స్థానంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. తాత్కాలిక బడ్జెట్‌లో కూడా దీనికి నిధులు కేటాయించింది. ఈ పథకం కోసం 7740 కోట్లు కేటాయించారు. అంతే కాకుండా ఈ పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మంలో ప్రారంభించారు. ఈ పథకానికి హడ్కో వెయ్యికోట్ల రుణాన్ని కూడా మంజూరు చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో పనులు ముందుక సాగలేదు. ఇప్పుడు వాటిని జెట్‌స్పీడ్‌తో పూర్తి చేయాలని భావిస్తున్నరు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com