Gujarat Floods : వరదలతో గుజరాత్ ఉక్కిరిబిక్కిరి

గుజరాత్ వర్షాలు, వరదలకు గజగజా వణికిపోతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతా జలమయమైంది. వందలాదిమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నవ్ సారి జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో సౌరాష్ట్ర రీజియన్ పరిధిలో భారత వాతావరణ విభాగం ఐఎండీ.. రెడ్ అలర్ట్ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలతో వల్సాడ్, తాపి, నవ్ సారి, సూరత్, నర్మద, పంచ్ మహల్ జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. మోర్బీ జిల్లాలో నదిపై నిర్మించిన కాజ్ వే మీదుగా వరద పోటెత్తింది. ఈ సందర్భంగా కాజ్ వే మీదుగా వెళుతున్న ట్రాక్టర్ ట్రాలీ వరద నీటిలో కొట్టుకుపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తుల ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. దక్షిణ గుజరాత్ పరిధిలోని జిల్లాలో సగటు వర్షపాతం కంటే 105 శాతానికి పైగా వర్షపాతం రికార్డ్ అయ్యింది. సౌత్ గుజరాత్, సౌరాష్ట్ర పరిధిలోని ఎనిమిది జిల్లాల పరిధిలో సగటు వర్షపాతం కంటే వంద శాతం వర్షపాతం కురిసింది.
సోమవారం ఆరు గంటల్లోపు గత 24 గంటల్లో నవ్ సారీ జిల్లా ఖేర్ గామ్ తాలూకా పరిధిలో అత్యధికంగా 356 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. వడోదరలోని పద్రాలో 270 మిల్లీ మీటర్ల వర్షపాతం కురిసింది. నర్మద, సౌరాష్ట్ర, రాజ్ కోట్, తాపి, మహిసాగర్, మోర్బీ, దాహోద్, వడోదర జిల్లాల్లో 100 మీల్లీ మీటర్ల పైచిలుకు వర్షపాతం నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com