Karnataka : బళ్లారిలో గుట్టలుగా నగదు, నగలు సీజ్
ఎన్నికల సంఘం ఆదేశాలతో పోలీసులు సర్చ్ ఆపరేషన్ ను స్పీడప్ చేశారు. అక్రమంగా నగదు, బంగారం, నగలు తరలించే వారిపై ఫోకస్ పెట్టారు. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఏప్రిల్ 26న, మే 4వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశాలు ఎక్కువ కావడంతో.. ఎక్కడికక్కడ వాహన తనిఖీలు చేస్తూ భారీ ఎత్తున డబ్బులను సీజ్ చేస్తున్నారు.
కర్ణాటకలోని (Karnataka) ఓ వ్యాపారి ఇంట్లో భారీగా నగదు, బంగారు, వెండి ఆభరణాలు పట్టుకున్నారు పోలీసులు. బళ్లారిలోని (Bellary) స్థానిక ఆభరణాల వ్యాపారి నరేశ్ సోనీ ఇంట్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. లెక్కల్లో లేని రూ.5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారు ఆభరణాలు, 103 కిలోల వెండి ఆభరణాలు, 68 వెండి కడ్డీలను సీజ్ చేశారు. గుట్టలుగా పేర్చిన నగదు, ఆభరణాలకు సంబంధించిన వీడియో పోలీసులు రిలీజ్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది.
భారీగా నగదు, నగలు పట్టుబడటంతో.. హవాలా మార్గంలో నగదు, ఆభరణాలను తీసుకొచ్చి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నగల వ్యాపారి నరేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తును ఐటీ శాఖకు అందివ్వనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com