Heavy Rainfall : ఢిల్లీకి భారీ నుంచి అతిభారీ వర్ష సూచన

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన దేశ రాజధాని ఢిల్లీకి IMD షాకింగ్ న్యూస్ చెప్పింది. నేడు, రేపు హస్తినలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా గత 24 గంటల్లో ఢిల్లీలో 228 మి.మీ వర్షపాతం నమోదైంది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. విద్యుత్ అంతరాయం, ట్రాఫిక్ జామ్‌లతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షానికి ఢిల్లీ ఎయిర్‌పోర్టు పైకప్పు కూలి ఒకరు మరణించిన విషయం తెలిసిందే.
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లోని టెర్మినల్-1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. పైకప్పు కింద పార్క్ చేసిన అనేక వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. దాంతో కారులోని ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 గంటల సమయంలో సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com