కంగనా వస్తే చెంప దెబ్బ కొడతాం.. తమిళనాడు కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్‌పై తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. కంగనా తమిళనాడుకు వస్తే ఆమెను చెంపదెబ్బ కొట్టాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అళగిరి. గతంలో రైతుల గురించి కంగనా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఆయన ఇలా స్పందించారు.
గతంలో కంగనా గ్రామీణ మహిళలను కించపరిచారని అళగిరి ఆరోపించారు. ఇటీవల కొందరు రైతుకు నా దగ్గరకు వచ్చి కంగనా రనౌత్ గురించి ఫిర్యాదు చేశారని... గ్రామీణ మహిళలు రూ.100 ఇస్తే ఎక్కడికైనా వస్తారని ఆమె గతంలో మాట్లాడారని వారు చెప్పినట్లు అళగిరి తెలిపారు. ఒక సిట్టింగ్ ఎంపీగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నన్ను షాక్‌కు గురిచేశాయి" అని ఆయన వివరించారు. కాగా 2020లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సమయంలో, ఆందోళనలో పాల్గొన్న వృద్ధురాలి గురించి కంగనా చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ఆ వృద్ధురాలు రూ.100 కోసం వచ్చిందని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తీవ్ర విమర్శలు రావడంతో ఆ పోస్ట్‌ను తొలగించారు.
గతంలో ఛండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో కంగనాను ఒక మహిళా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనను అళగిరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. "ఆ అధికారిణి చేసిన పనినే మీరు కూడా చేయండి. కంగనా మన ప్రాంతానికి వస్తే ఆమెను చెంపదెబ్బ కొట్టండి. అప్పుడే ఆమె తన తప్పు తెలుసుకుంటుంది" అని రైతులకు తాను సూచించినట్లు అళగిరి తెలిపారు.
ఇక అళగిరి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో విలేకరులతో మాట్లాడుతూ, "భారతదేశంలో నేను ఎక్కడికైనా వెళ్లగలను. నన్ను ఎవరూ ఆపలేరు. నన్ను ద్వేషించేవాళ్లు కొందరు ఉంటే, ప్రేమించేవాళ్లు అంతకంటే ఎక్కువే ఉన్నారు" అని అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com