Impact of Elections : ఎన్నికల ఎఫెక్ట్.. పెరిగిన విమాన ఛార్జీలు!

ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఈనెల 11 నుంచి 13 వరకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో, విమాన టికెట్ ధరలు 20-30% పెరిగాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి వైజాగ్‌కి ₹4,500 ఉండే టికెట్ ధర ఈనెల 12వ తేదీకి ₹6,500కి చేరింది. హైదరాబాద్-కొచ్చి ధర ₹5వేల నుంచి ₹7వేలకు పెరిగింది. రద్దీని బట్టి ఛార్జీలుంటాయని ట్రావెల్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, దిల్లీ, చెన్నై, కేరళ, గోవా, కొచ్చిలకు వెళ్లే విమాన సర్వీసుల టికెట్ ధరలు 20 నుంచి 30 శాతం మేర పెరిగాయి.
హైదరాబాద్ నుంచి సాధారణంగా రోజుకు సగటున 50,000 మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం వారి సంఖ్య దాదాపు 60 వేలకు పెరిగింది. కొద్దిరోజులుగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలతో కొడైకెనాల్, కొచ్చి, ఊటీ, కేరళ, జైపుర్, దిల్లీ, అయోధ్య, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్, మలేసియా తదితర ప్రాంతాలకు రద్దీ పెరిగింది. ఎన్నికల దృష్ట్యా దిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు నేతల రాకపోకలు పెరిగాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com