Vijay : సీఎంపై అనుచిత వ్యాఖ్యలు.. స్టార్ట్ హీరో విజయ్‌పై కేసు నమోదు..

ప్రముఖ తమిళ నటుడు, ఇటీవల తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అధినేత విజయ్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
డీఎంకే పార్టీకి చెందిన న్యాయవాది ఎన్. మురళీ కృష్ణన్ ఈ మేరకు తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ఏముంది?
సెప్టెంబర్ 20వ తేదీన విజయ్ చేసిన ప్రసంగంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మురళీ కృష్ణన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
మురళీ కృష్ణన్ మరిన్ని తీవ్ర ఆరోపణలు చేస్తూ, తన రాజకీయ ప్రయోజనాల కోసమే విజయ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, విజయ్‌పై తక్షణమే కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు.
ఎన్నికల వేళ ప్రాధాన్యత
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ పరిణామం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార డీఎంకే తిరిగి పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తుండగా, ఎన్డీఏ కూటమి విజయం కోసం పట్టుదలతో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో కొత్త రాజకీయ శక్తిగా ఎదగాలని విజయ్ భావిస్తుండగా.. ఈ ఫిర్యాదు ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com