India Alert : భారత్ అలర్ట్.. చైనా నుంచి పాక్‌కు నిషేధిత రసాయనాలు

చైనా నుంచి పాకిస్థాన్ కు ఎగుమతి అవుతోన్న నిషేధిత రసాయనాలను తమిళనాడు తీరంలో భారత భద్రతా సంస్థలు స్వాధీనం చేసుకున్నాయి. టియర్ గ్యాస్ వంటివాటి తయారీలో ఉపయోగించే ఆ రసాయనాల ఎగుమతులపై అంతర్జాతీయంగా నిషేధం ఉందని అధికారులు తెలిపారు. డ్రాగన్ సాయంతో ప్రమాదకర రసాయన, జీవాయుధాల తయారీ కార్యక్రమాల్లో పాకిస్థాన్ నిమగ్నమై ఉందని ఆరోపించారు.
చైనాకు చెందిన ఓ సంస్థ పాకిస్థాన్ లోని ఓ రక్షణ ఉత్పత్తుల సరఫరాదారుకు ఆర్థో-క్లోరో బెంజి లిడిన్ మలోనోనిట్రైల్ అనే రసాయనాన్ని చేరవేసేందుకు సిద్ధమైంది. 2560 కిలోల ఆ సరకును 103 డ్రమ్ముల్లో నింపి.. ఏప్రిల్ 18న షాంఘై నౌకాశ్రయంలో ఓ వాణిజ్య నౌకలో లోడ్ చేసింది. కరాచీకి బయల్దేరిన ఆ నౌక.. మే 8న తమిళనాడులోని కట్టుపల్లి పోర్టుకు చేరుకుంది. తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు ఆ అనుమానాస్పద సరుకును గుర్తించారు. నిపుణుల సాయంతో పరీక్షించగా.. నిషేధిత రసాయనంగా తేలడంతో స్వాధీనం చేసుకున్నారు.
'వాస్సె నార్ అరేంజ్మెంట్' కింద దీని ఎగుమతిపై ఆంక్షలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలోనూ చైనా నుంచి పాకిస్థాన్ కు వెళ్తున్న ఓ నౌకను ముంబై పోర్టులో భద్రతా ఏజెన్సీలు అడ్డుకున్నాయి. అణు కార్యక్రమంలో వినియోగించే సరకును అందులో తరలిస్తున్నారనే నిఘా సమాచారంతో దానిని నిలిపివేశాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com