Indian Economy : జర్మనీని దాటేసి..ప్రపంచంలోనే నంబర్ 3గా భారత్..ఎస్బీఐ నివేదికలో షాకింగ్ నిజాలు.

Indian Economy : జర్మనీని దాటేసి..ప్రపంచంలోనే నంబర్ 3గా భారత్..ఎస్బీఐ నివేదికలో షాకింగ్ నిజాలు.
X

Indian Economy : భారతదేశ ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలన్నీ మన వైపు ఆశ్చర్యంగా చూసేలా భారత్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా పరిశోధన నివేదిక ప్రకారం.. భారత్ అతి త్వరలోనే ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించబోతోంది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుపై ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అత్యంత సానుకూల నివేదికను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న భారత్, 2028 కల్లా జర్మనీని వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. 1990లో ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో 14వ స్థానంలో ఉన్న మనం, 2025 నాటికి 4వ స్థానానికి చేరుకున్నాం. మరో రెండేళ్లలో మూడో స్థానాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 2028 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని అంచనా.

ఎస్బీఐ రిపోర్ట్ ప్రకారం.. భారత్ కేవలం ఆర్థిక పరిమాణంలోనే కాదు, ప్రజల సగటు ఆదాయంలో కూడా భారీ మార్పులు చూడబోతోంది. 2030 నాటికి భారతదేశం అప్పర్ మిడిల్ ఇన్కమ్(ఎగువ మధ్యతరగతి ఆదాయం) దేశంగా మారుతుంది. 1962లో భారతీయుడి సగటు ఆదాయం కేవలం 90 డాలర్లు ఉంటే, అది 2007లో 910 డాలర్లకు, 2019లో 2,000 డాలర్లకు చేరింది. 2026 నాటికి ఇది 3,000 డాలర్లకు, 2030 నాటికి సుమారు 4,500 డాలర్లకు (దాదాపు రూ.3.75 లక్షలు) చేరుకుంటుందని ఎస్బీఐ అంచనా వేస్తోంది. వరల్డ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఇది భారత్‌ను కొత్త కేటగిరీలోకి తీసుకెళ్తుంది.

గత పదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ స్థిరమైన వృద్ధిని కనబరిచింది. ప్రపంచ అభివృద్ధిలో భారతదేశం ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తోంది. ఎస్బీఐ నివేదిక ప్రకారం, భారత్ కేవలం 2028 నాటికే పరిమితం కాకుండా, 2036 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థాయిని అందుకునే దిశగా సాగుతోంది. ఇదే వేగంతో ముందుకు వెళ్తే, స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి అంటే 2047 నాటికి భారత్ హై ఇన్కమ్(అధిక ఆదాయం కలిగిన) దేశంగా, అంటే ధనిక దేశాల జాబితాలోకి చేరుకునే అవకాశం ఉంది.

భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విప్లవం మరియు తయారీ రంగంలో వస్తున్న మార్పులే ఈ వృద్ధికి ప్రధాన కారణాలు. దేశీయంగా వినియోగం పెరగడం, విదేశీ పెట్టుబడులు భారీగా రావడం వల్ల మన జీడీపీ పరుగులు పెడుతోంది. గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ దేశాలు మాత్రమే భారత్ కంటే వేగంగా అభివృద్ధి చెందాయి. ఈ పరిణామాలు భారతీయుల జీవన ప్రమాణాలను పెంచడమే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మరింత పెంచుతున్నాయి.

Tags

Next Story