President Droupadi Murmu : త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ : ద్రౌపది ముర్మ

భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ చెప్పారు. ఇవాళ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆమె పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. మహాకుంభ్ భారతీయ సంస్కృతి కి చిహ్నమని చెప్పారు. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఆమె నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. బడ్జెట్ లో మహిళలకు, యువతకు పెద్ద పీట వేస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేసినట్టు చెప్పారు. కుంభమేళాలో తొక్కిసలాట జరగడం బాధాకరమని అన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణానికి 12 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని చెప్పారు. పేదరిక నిర్మూలనకు అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. లక్షా 15 వేల అక్కలను లక్షాధికారులను చేసినట్టు చెప్పారు. ఉద్యోగులు కోసం వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. దేశాభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనే సంకల్పంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ దిశగా అడుగులు వేస్తున్నామని రాష్ట్రపతి చెప్పారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. ఇండియా ఏఐ మిషన్ ప్రారంభించామని రాష్ట్రపతి చెప్పారు. ఎంఎస్ఎంఈల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీం తెచ్చామని అన్నారు. భారత్ ను గ్లోబల్ ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇందులో భాగంగా బ్యాంకింగ్ వ్యవస్థను డిజిటలైజ్ చేశామన్నారు. సైబర్ సెక్యూరిటీ, డీప్ ఫేక్ ల నివారణకు ప్రత్యేక చర్యలు మొదలయ్యాయని వివరించారు. టెలీమెడిసిన్, మెడికల్ డివైజెస్ తయారీని పెంచామని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com