Indian Rupee : చరిత్రలో తొలిసారి డాలర్‌తో పోలిస్తే 96.23కు పతనం.. సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం ?

Indian Rupee : చరిత్రలో తొలిసారి డాలర్‌తో పోలిస్తే 96.23కు పతనం.. సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయం ?
X

Indian Rupee : భారత కరెన్సీ అయిన రూపాయి విలువ మునుపెన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్ ఆధిపత్యం పెరగడం, ముడి చమురు ధరలు మంట పుట్టించడంతో సోమవారం ట్రేడింగ్‌లో రూపాయి విలువ ఆల్ టైమ్ లో రికార్డు స్థాయికి చేరుకుంది. ఒక అమెరికా డాలర్ ధర ఏకంగా రూ.96.23 వద్దకు చేరడం దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు సృష్టిస్తోంది. గత శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి 95.97 వద్ద ఉన్న రూపాయి, ఈ వారం ప్రారంభంలోనే కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు రూపాయి పతనానికి ప్రధాన కారణమయ్యాయి. ఈ యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 111 డాలర్ల మార్కును దాటేసింది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గంలో అడ్డంకులు ఏర్పడవచ్చనే భయం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. భారత్ తన అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 80 శాతం దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరిగితే మనం చెల్లించాల్సిన దిగుమతి బిల్లు భారీగా పెరుగుతుంది, దీనివల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ మరింత తగ్గిపోతోంది.

రూపాయిని దెబ్బతీస్తోంది కేవలం చమురు మాత్రమే కాదు, అమెరికా నుంచి వస్తున్న ఆర్థిక సంకేతాలు కూడా రూపాయికి వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్ 4.625 శాతానికి పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లు సురక్షితమైన అమెరికా బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిపోతున్నాయి. ఫలితంగా డాలర్ బలపడుతూ రూపాయి బలహీనపడుతోంది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే ఊహాగానాలు కూడా కరెన్సీ మార్కెట్‌ను భయపెడుతున్నాయి.

రూపాయి విలువ మరీ దారుణంగా పడిపోకుండా ఉండేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తోంది. రూపాయి 96 స్థాయిని దాటకుండా ఉండేందుకు గత శుక్రవారం ఆర్‌బీఐ మార్కెట్లో జోక్యం చేసుకున్నట్లు సమాచారం. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్‌బీఐ రూపాయి పతనాన్ని పూర్తిగా ఆపడం కంటే, మార్కెట్లో అస్థిరతను తగ్గించడానికే ప్రాధాన్యత ఇస్తుంది. అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలించనంత వరకు రూపాయి కోలుకోవడం కష్టమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

రూపాయి బలహీనపడటం అంటే దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడమే. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, వంట నూనెల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులకు, విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఖర్చు భారీగా పెరుగుతుంది. మొత్తంమీద రూపాయి రూపం మారుతుండటం సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌ను దెబ్బతీయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags

Next Story