ISRO : చంద్రునిపై శివశక్తి ప్రదేశం ప్రాధాన్యత తెలిపిన ఇస్రో

చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా, విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన శివశక్తి ప్రదేశం అత్యంత ప్రాచీనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికంటే కూడా పురాతనమైనదని తేల్చారు. చంద్రయాన్-3 మిషన్ నిద్రాణ స్థితిలోకి వెళ్లినప్పటికీ, అందులోని పరికరాల నుంచి ఇస్రోకు సంకేతాలు అందుతూనే ఉన్నాయి. వీటి ఆధారంగా శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణల దిశగా ముందడుగేస్తున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత భౌగోళిక పటా న్ని భారత ఫిజికల్ రీసెర్చి ల్యాబొరేటరీ (పీఆర్ఎల్) బృందం రూపొందించింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు, శివశక్తి ప్రాంతం దాదాపు 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించిన అధ్యయనం సైన్స్ డైరెక్ట్ ప్రచురితం అయింది. భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ. ఒక గ్రహం ఉపరితల ఆకృతి ప్రాదేశిక, తాత్కాలిక క్రమాలను అర్ధం చేసుకోవడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ 2023 ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా అడుగుపెట్టింది. భారత వైజ్ఞానికి సత్తాను ఇది ప్రపంచానికి చాటిచెప్పింది. దీంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com