ISRO: మరో ప్రయోగానికి సిద్ధం

చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి PSLV C-56 రాకెట్‌ను రేపు ఉదయం 6.30 గంటలకు ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను ఈరోజు ఉదయం ప్రారంభించింది ఇస్రో.. 25.30 గంటల పాటు కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత PSLV C-56, ఆదివారం ఉదయం 6.30 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ దేశానికీ చెందిన DS-SAR అనే ఉపగ్రహంతో పాటు అదే దేశానికి చెందిన మరో 6 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చనుంది పీఎస్‌ఎల్వీ- సీ56 రాకెట్. ఇది పూర్తి స్థాయిలో వాణిజ్య ప్రయోగమని తెలిసిందే..
ఈ DS-SAR సింగపూర్ గవర్నమెంట్ కు చెందిన వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాల అవసరాలకు మద్దతు ఇస్తుంది. ST ఇంజనీరింగ్ యొక్క వాణిజ్య వినియోగదారుల కోసం బహుళ-మోడల్ మరియు అధిక ప్రతిస్పందనాత్మక చిత్రాలను మరియు జియోస్పేషియల్ సేవలను అందిస్తుంది. దీనితో తోపాటు టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-ఏఎం, ఎక్స్‌పరిమెంటల్ శాటిలైట్ ‘ఆర్కేడ్’, 3యూ నానోశాటిలైట్ ‘స్కూబ్-2’, ఐవోటీ కనెక్టివిటీ నానోశాటిలైట్ ‘నూలయన్’, గలాసియా-2, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను కూడా రోదసిలోకి పంపనున్నారు.
ఇక మన చంద్రయాన్-3 విషయానికి వస్తే ఇది భూగురుత్వాకర్షణ పరిధిని దాటి విజయవంతంగా ఐదు దశలను పూర్తి చేసుకుని చంద్రుడివైపు వేగంగా కదులుతోంది. దీని తరువాత చేపట్టే దశలు అన్నీ చంద్రయాన్-3 ప్రయోగానికి కీలకమే అని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే చంద్రయాన్-3 ఆగస్టు 1, 2023 నిర్దేశించిన ప్రకారం చంద్రుడి గురుత్వాకర్షణ పరిధిలోకి ప్రవేశించనుంది. ఈ మిషన్ లో ఇది కీలకమైన దశగా ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. క్రమంగా ఈ కక్ష్య పరిధిని కుదించుకుంటూ చంద్రునికి దగ్గరగా వెళ్తుంది. అలా ఆగస్టు చివరి నాటికి చంద్రునికి 30 కిలోమీటర్ల దగ్గరి వరకు వెళ్తుంది. చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి చేరుకున్న తర్వాత అసలు సిసలు పరీక్ష ప్రారంభం అవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com