JDS : ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేసిన జేడీఎస్

కర్ణాటకలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను సస్పెండ్ చేస్తున్నట్లు జేడీఎస్ పార్టీ ప్రకటించింది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు, పలు వీడియోలు బయటకు రావడంపై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం SIT ద్వారా విచారిస్తోంది. ఈ నేపథ్యంలో విచారణకు తాము సహకరిస్తామని.. అప్పటివరకు రేవణ్ణను సస్పెండ్ చేస్తున్నట్లు JDS వెల్లడించింది. అటు రేవణ్ణ ఇప్పటికే విదేశాలకు పారిపోయారు.
మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, హసన్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు కర్నాటక రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి. ఎన్నికల టైమ్ లో ప్రజ్వల్ అసభ్యకర టేపులు బయటపడడం కలకలం రేపుతోంది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల టేపులు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు టేపులపై రచ్చ జరుగుతుండగానే ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి జంప్ అయినట్టు తెలుస్తోంది. ఆ వీడియోలు పాతవని, ప్రత్యర్థులు కుట్ర చేశారని కొడుకుని సమర్థిస్తున్నారు తండ్రి రేవణ్ణ.
రేవణ్ణ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తున్న ఆయన సమీప బంధువే ప్రజ్వల్ బాగోతం బయటపెట్టింది. రేవణ్ణతో పాటు ఆయన కుమారుడు ప్రజ్వల్ తనపై, తన కూతురిపై పలుమార్లు లైంగికదాడి చేశారని ఆ మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రేవణ్ణ భార్య భవానీ ఇంట్లో లేని టైమ్ లో తనపై లైంగిక దౌర్జన్యానికి దిగేవారని బాధితురాలి ఆరోపించింది.
ఇంట్లో నుంచి తన కుమార్తెకు వీడియో కాల్ చేసి ప్రజ్వల్ అసభ్యంగా ప్రవర్తించేవాడని కంప్లైంట్ చేసింది. JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. బెంగళూరు, హుబ్లీలో కార్యకర్తలు నిరసనలకు దిగారు. ప్రజ్వల్ ను బీజేపీ కాపాడిందని ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com