Maharashtra CM : మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్.. తేల్చేసిన మహాయుతి కూటమ

మహారాష్ట్రలో పవర్ సస్పెన్స్‌కు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును మహాయుతి కూటమి ప్రకటించింది. ఇవాళ ముంబైలో జరగనున్న శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతగా బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ సీఎంగా పదవి స్వీకరించేందుకు అపద్దర్మ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ షిండే అంగీకరించడంతో ఫడ్నవీస్ సీఎం కుర్చీలో కూర్చునేందుకు లైన్ క్లియరైంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా మహాయుతి నేతలు బుధవారం గవర్నర్‌ను కలిసి కోరనున్నారు. ముంబయిలోని ఆజాద్ గ్రౌండ్‌లో సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. అయితే కూటమిలోని ఇతర పార్టీలైన షిండే శివసేన, ఎన్సీపీ అజిత్‌పవార్ లలో ఏకాభిప్రాయం లేకపోవడంతో సీఎం అభ్యర్థి ప్రకటనలో ఆలస్యమైంది. కూటమిలో సీఎం రేసు నుంచి అజిత్ పవార్ తొలుత తప్పుకున్నారు. శివసేన చీఫ్ షిండే మాత్రం కొన్ని రోజులు అలక బూనారు. బీజేపీ పెద్దలు రంగంలోకి దిగిన ఆయనను ఒప్పించి మంత్రి పదవుల పంపిణీలో సముచిత ఫార్ములాను రూపొందించారు. అందరూ సెట్ అయ్యాకా సీఎంగా ఫడ్నవిస్ పేరును ఖరారు చేశారు. ప్రస్తుతం మహాయుతి కూటమిలో ఎటువంటి అసంతృప్తులు లేవని పార్టీ నేతలు చెబుతున్నారు. కేబినెట్ లో పదవులు పంపకాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com