Mumbai Murder: మేకప్ ఆర్టిస్ట్ ప్రాణాలను బలిగొన్న ‘ప్రేమ’

Mumbai Murder:  మేకప్ ఆర్టిస్ట్ ప్రాణాలను బలిగొన్న ‘ప్రేమ’
పెళ్లి చేసుకోవాలని కోరడంతోనే హత్య..

గత కొంత కాలంగా జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తుంటే ప్రేమ అనేదానికి అర్థం లేకుండా పోతోంది. ప్రేమించుకున్నామా.. శారీరక సుఖం పొందామా.. విడిపోయామా.. అన్నట్టుగా నేటి లవ్ స్టోరీలు కనిపిస్తున్నాయి. దీనికి కాస్త అప్డేటెడ్ గా పెట్టేనా పేరు సహజీవనం. సహజీవనం లో పెళ్లి అనే పేరే రాకుండా చూసుకుంటున్నారు కొందరు. ఒకవేళ అలా ఏ అమ్మాయి అయినా అడిగిందా తరువాత ఆమె కనపడకుండా పోతోంది. అచ్చు ఇలాంటి సంఘటనే జరిగింది

ముంబైలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న 28 ఏళ్ల మహిళ, తనపై లవర్ అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు తర్వాత మహిళను ఆమె భాగస్వామి దారుణంగా హత్య చేశాడు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. ఈ హత్యకు అతని భార్య కూడా సహాయం చేసింది. మహిళను చంపేసి పక్క రాష్ట్రం గుజరాత్ లోని వల్సాద్ లో పడేశారు. మేకప్ ఆర్టిస్ట్ నైనా మహత్‌ కు ఐదేళ్ల క్రితం మనోహర్ శుక్లా తో పరిచయం ఏర్పడింది. మనోహర్‌కు అప్పటికే పెళ్లయి, పిల్లలు ఉన్నప్పటికీ.. నైనాతో సన్నిహితంగా మెలిగాడు. నైనా కూడా అతనికి దగ్గరైంది. వీరి ఎఫైర్ గురించి అటు మనోహర్ కుటుంబానికి, ఇటు నైనా ఫ్యామిలీకి తెలుసు. అయితే ఆగస్టు 12వ తేదీన నైనా కుటుంబ సభ్యులు నైగావ్ పోలీసుల్ని ఆశ్రయించారు. ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వస్తోందని, తమకేదో అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి.. నైనా నివాసం ఉండే సన్‌టెక్ కాంప్లెక్స్‌లో తనిఖీ నిర్వహించారు. ఆ కాంప్లెక్స్‌లో ఉండే సీసీటీవీని పరిశీలించగా.. మనోహర్‌తో పాటు అతని భార్య ఓ సూట్‌కేసుతో ఎక్కడికో బయలుదేరడాన్ని గుర్తించారు.


ఈ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు మంగళవారం శుక్లాని అరెస్ట్ చేశారు. అతడ్ని విచారించగా.. తమ ఎఫైర్ గురించి తన భార్యకు తెలిసినప్పటి నుంచి తాను నైనా మహత్‌కి బ్రేకప్ చెప్పానన్నాడు. కానీ.. మహత్ మాత్రం పెళ్లి చేసుకోవాలని తనని ఒత్తిడి చేసేదని, లేకపోతే అత్యాచారం కేసు పెడతానని బెదిరింపులకు పాల్పడేదని చెప్పాడు. దీంతో మరోదారి లేక తాను మహత్‌ని హతమార్చానని తన నేరం అంగీకరించాడు. మరోవైపు.. మహత్ మృతదేహం వల్సద్ క్రీక్‌లో ఒక సూట్‌కేసులో లభ్యమైంది. అక్కడిదాకా ఆమె మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లారనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. అటు.. తమ కూతురిని ప్రేమ పేరుతో వంచించి, ఇప్పుడు చంపేసిన మనోహర్ ను కఠినంగా శిక్షించాలని నైనా తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story