Viral : ఎస్‌బీఐ బ్యాంక్‌లో భారీ దోపిడీ.. 50 కిలోల బంగారం, రూ.8 కోట్లు చోరీ

కర్ణాటకలోని విజయపుర జిల్లా చడ్చనా పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంగళవారం సాయంత్రం భారీ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించి, తుపాకులు, ఇతర ఆయుధాలతో వచ్చిన దుండగులు సిబ్బందిని బెదిరించి సుమారు 50 కిలోల బంగారం, రూ.8 కోట్ల నగదును దోచుకున్నారు. ఈ ఘటన బ్యాంకు మూసివేసే సమయానికి అంటే సాయంత్రం 6:30 గంటల సమయంలో జరిగింది. దొంగలు ఒక్కసారిగా బ్యాంకులోకి చొరబడి, ఉద్యోగులను బంధించారు. బ్యాంక్ మేనేజర్‌ను అలారం బెల్ నొక్కకుండా ఆయుధాలతో బెదిరించి, స్ట్రాంగ్‌రూమ్ వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత అక్కడి సొమ్మును దోచుకొని పరారయ్యారు. ఒక కస్టమర్ బ్యాంకులోకి వెళ్లి ఈ పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసుల దర్యాప్తు దొంగలు మిలిటరీ యూనిఫామ్‌ను పోలిన దుస్తులు ధరించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితులు వాడిన కారు మహారాష్ట్రలోని పంధర్‌పుర్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఎస్పీ లక్ష్మణ్ నింబార్గి ఈ కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. దొంగలు ముగ్గురి కంటే ఎక్కువ మంది ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. వారు మహారాష్ట్రకు పారిపోయి ఉండవచ్చని ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. దొంగలను పట్టుకోవడానికి కర్ణాటక, మహారాష్ట్రలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ఈ ఏడాది మే నెలలో కూడా విజయపుర జిల్లాలోని కెనరా బ్యాంక్‌లో ఇలాంటి దోపిడీనే జరిగింది. అప్పుడు కూడా దొంగలు 58 కిలోల బంగారం, రూ.5.2 లక్షల నగదును దోచుకున్నారు. పోలీసులు ఆ దోపిడీని ఖాదీమారా ముఠా చేసిందని గుర్తించారు. తాజాగా జరిగిన ఈ దోపిడీతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com