Narendra Modi : రేపు సాయంత్రం ప్రధాని మోడీ ప్రమాణం.. చకచకా ఏర్పాట్లు

ఎన్డీఏ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన నరేంద్ర మోదీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆహ్వానించారు. కూటమికి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని మోడీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. దాంతో మోడీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. మోడీతో పాటు వచ్చిన ఎన్డీఏ పక్ష నేతలు ఆమెకు ఎన్డీఏకు మద్దతిస్తున్న ఎంపీల జాబితాను అందజేశారు.
ప్రజల ఆశలు, ఆకాంక్షలకు తగినట్లుగా పనిచేస్తామని రాష్ట్రపతిభవన్ వెలుపల మోడీ మాట్లాడుతూ హామీ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రధాని ప్రమాణానికి సంబంధించిన ఏర్పాట్లలో రాష్ట్రపతి భవన్ అధికారులు నిమగ్నమై ఉన్నారు. దాదాపు 8000 మంది అతిథులు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. 2014. లో సార్క దేశాల అధినేతలు హాజరుకాగా.. 2019 లో బిమ్స్‌టక్ దేశాల నాయకులు పాల్గొన్నారు.
ఈసారి బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, మాల్దీవులు సహా పలు దేశాల అధినేతలు రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూటమి నాయకులు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు అతిథులుగా హాజరవనున్నారు. అలాగే సెంట్రల్ విస్టా నిర్మాణ కార్మికులు, వందే భారత్ వంటి కీలక ప్రాజెక్టుల్లో పనిచేసిన వారికి, వికసిత్ భారత్ పథకాలకు అంబాసిడర్లుగా పనిచేస్తున్న వారికి ఆహ్వానం పంపినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com