Electoral Bonds : రాజకీయ పార్టీలకు నిధులు మస్ట్.. ఎలక్టోరల్ బాండ్లపై గడ్కరీ హాట్ కామెంట్

ఎలక్టోరల్ బాండ్లకు (Electoral Bonds) మద్దతుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) హాట్ కామెంట్స్ చేశారు. నిధులు లేకుండా రాజకీయ పార్టీని నడపడం సాధ్యం కాదని గడ్కరీ స్పష్టం చేశారు. ఎంతో మంచి ఉద్దేశంతో ఎలక్టోరల్ బాండ్స్ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. అధికారంలో ఉన్న పార్టీలు మారినప్పుడు చిక్కులు రాకుండా ఉండేందుకే దాతల వివరాలను రహస్యంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.
గుజరాత్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గడ్కరీ స్పందించారు. 'కొన్ని దేశాల్లో ప్రభుత్వాలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూరుస్తాయి. భారతదేశంలో అలాంటి వ్యవస్థ లేదు. అందుకే, రాజకీయ పార్టీలకు ఆర్థికసాయం చేసే ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ఎంచుకున్నాం' అని చెప్పారు. ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన చర్చల్లో తాను పాల్గొన్నట్టు గుర్తు చేశారు. మీడియా సంస్థకు ఒక ఈవెంట్‌కు ఆర్థిక సహాయం చేయడానికి స్పాన్సర్ అవసరం అయినట్లే రాజకీయ పార్టీలకు కూడా తమ వ్యవహారాలను నిర్వహించడానికి నిధులు అవసరమని నొక్కిచెప్పారు.
'భారత్ విలువ-ఆధారిత ప్రజాస్వామ్య దేశం. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు నిధులు అందజేసేందుకు పారదర్శకమైన మార్గాన్ని కనుగొనాలి. ఎందుకంటే నిధులు లేకుండా, పార్టీలు ఎటువంటి కార్యక్రమాలను చేపట్టలేవు' అని వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ బాండ్ స్కీమును సరిదిద్దేందుకు సుప్రీంకోర్టు ఏమైనా సలహాలు, సూచనలు స్వీకరించి ఉంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com