Lok Sabha Elections : లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రపతి కూతురు

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుమార్తె ఇతిశ్రీ ముర్ము పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్ లోక్‌సభ స్థానం నుంచి ఆమెను బరిలో దింపాలని బీజేపీ భావిస్తోందట. గిరిజనులు అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇతిశ్రీని పోటీకి నిలబెడితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరపతి కలిసివస్తుందని భావిస్తోందట. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే బీజేపీ అధికారిక ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాల్సిందే. ఇతిశ్రీ తన తల్లి ద్రౌపది ముర్ము అత్యున్నత పదవిని చేపట్టినప్పటి నుంచి తరచూ ఒడిశా పర్యటనలు చేస్తున్నారు. తల్లి పరపతి, పలుకుబడి కుమార్తె అభ్యర్థిత్వానికి పట్టం గట్టే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఎన్నికల పోరులో ఇతిశ్రీ ఆరంగేట్రం చేయడం రాష్ట్రంలోని బీజేపీ నేతలు, కార్యకర్తలతో పాటు ఓటర్లకు ప్రత్యేక సందేశం ఇస్తుందని భావిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభాలో గిరిజన వర్గం ఓటర్లు 22 శాతానికి పైబడి ఉన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత ఒడిశాలో గిరిజనుల జనాభా అధికంగా ఉంది. ద్రౌపది ముర్ముకు సర్వోన్నత రాష్ట్రపతి పట్టం గట్టడం ద్వారా గిరిజనుల సాధికారత పట్ల బీజేపీ ఇప్పటికే తన నిబద్ధతను ప్రదర్శించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బిశ్వేశ్వర్ టుడు 25,256 ఓట్ల ఆధిక్యతతో బిజూ జనతా దళ్ (బీజేడీ) అభ్యర్థి దేబాషిస్ మరాండిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com