Trivandrum : గగన్‌యాన్ మిషన్ వ్యోమగాముల పేర్లను వెల్లడించిన ప్రధాని

కేరళ, తమిళనాడు, మహారాష్ట్రల్లో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ)ని సందర్శించారు. మూడు రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించి, శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన మూడు ముఖ్యమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలోనే భారతదేశ మానవ అంతరిక్ష యాత్ర మిషన్ 'గగన్‌యాన్' పురోగతిని సమీక్షిస్తారు.
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ఎంపికైన నలుగురు వ్యోమగాములు - గ్రూప్ కెప్టెన్ పి బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా పేర్లను కూడా మోదీ వెల్లడించారు.
ఈ మూడు ప్రాజెక్టులలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో 'పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్ సౌకర్యం', మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో 'సెమీ క్రయోజెనిక్స్ ఇంటిగ్రేటెడ్ ఇంజన్, స్టేజ్ టెస్ట్ ఫెసిలిటీ', విఎస్‌ఎస్‌సి వద్ద 'ట్రిసోనిక్ విండ్ టన్నెల్' ఉన్నాయి. ఇక భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఇన్‌ల్యాండ్ వాటర్‌వే నౌకను కూడా మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం మధురైలో ఆటోమోటివ్ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది MSME వ్యవస్థాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com