Rahul Gandhi : ప్రియాంక వారణాసిలో పోటీ చేస్తే మోదీని ఓడించేవారు: రాహుల్

తన సోదరి ప్రియాంకా గాంధీ ( Priyanka Gandhi ) వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని మోదీని ( PM Modi ) 2-3లక్షల ఓట్ల తేడాతో ఓడించేవారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది.
నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు. తాను అహంకారంతో చెప్పడం లేదని, మోదీ రాజకీయాలు ప్రజలకు నచ్చడం లేదని తాజా ఎన్నికల్లో తేలిందని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడుతామనే సందేశాన్ని ప్రజలు పంపారని తెలిపారు. కాగా ఈసారి ఎన్నికలకు ప్రియాంక దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అమేథి, రాయ్‌బరేలీలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించారని ప్రియాంకగాంధీ అన్నారు. ఈరోజు దేశమంతా అయోధ్య వైపు చూస్తోందని... స్వచ్ఛమైన, అంకితభావంతో కూడిన రాజకీయాలు అవసరమనే సందేశాన్ని ఈ ప్రాంతం చాటిచెప్పిందన్నారు. కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీ శ్రేణులు ఎన్నికల్లో సమన్వయంతో సాగి భారీ విజయాన్ని కట్టబెట్టారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com