Santosh Das Baba : మమత మృత్యుకుంభ్ వార్తలపై సాధువుల ఆగ్రహం

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్‌లో మహా కుంభమేళాను 'మృత్యు కుంభ్' అంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ప్రయాగ్ రాజ్‌లోని సాధు వర్గాల్లో ఆగ్రహ జ్వాలను రేకెత్తించాయి. మమత వ్యాఖ్యలు ఆమె భారత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం అని, ఆమె భారత్‌లో ఉంటున్నప్పటికీ పాకిస్తాన్ కోసం పనిచేస్తున్నారని, ఆమె పాక్ ఏజెంట్ అని జగద్గురు సంతోష్ దాస్ బాబా విమర్శించారు. భారత్ లో నివసించడానికి ఆమెకు అర్హత లేదని మండిపడ్డారు. టీఎంసీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బెంగాల్, భారత్ కు వ్యతిరేకంగా మమత పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహాకుంభమేళా ప్రాశస్త్యం గురించి ఆమెకు తెలియదని.. ఈ మహా పర్వంలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని సంతోష్ దాస్ అన్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుక గురించి మమత ఉపయోగించిన భాష తప్పు అని ఆయన పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన పట్ల సాధువర్గం విచారం వ్యక్తం చేస్తోందని.. అయితే ఈ ఘటనను పార్టీలు రాజకీయాల కోసం ఉపయోగించుకోవడం సరైనది కాదని హితవు పలికారు.
మమతా బెనర్జీ తాను నిర్వహిస్తున్న బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి ప్రకటన చేయడం సరికాదని అన్నారు శ్రీ పంచాయతీ అఖాడ మహా నిర్వాణి జాతీయ కార్యదర్శి శ్రీ మహంత్ జమునా పూరి జీ. "ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్ అనేది అమృత పర్వం అని, దీని గొప్పతనాన్ని ప్రపంచం మొత్తం చూసిందని, మహాకుంభ్ పై ఇలాంటి అవమానకర పదాలను మమత ఉపయోగించకూడదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com