Sam Pitroda : శామ్ పిట్రోడాకు తిరిగి బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ అనుహ్య నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనంగా మారిన శామ్ పిట్రోడాను ( Sam Pitroda ) తిరిగి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. గత నెలలో దక్షిణ భారతీయులను ఆఫ్రికన్లతో పోలుస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా వారసత్వ పన్ను విధానంపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ.. ‘‘ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మే 8న ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ పదవికి శామ్ పిట్రోడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఆమోదించారు. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారడంతో కాంగ్రెస్ ఆయన ప్రకటనలకు దూరంగా ఉంది. అంతేకాకుండా వాటిని ఆమోదయోగ్యం కాదు అని పేర్కొంది. పిట్రోడా పూర్తి పేరు సత్యన్నారాయణ గంగారామ్ పిట్రోడా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com