Bihar Politics : బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్‌కు ఊహించని షాక్

Bihar Politics : బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్‌కు ఊహించని షాక్

Bihar : బిహార్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రామ్ విలాస్ లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్‌కు 22 మంది కీలక నేతలు షాక్ ఇచ్చారు. లోక్ సభ టికెట్లు దక్కలేదనే నిరాశతో వారంతా పార్టీకి రాజీనామా ప్రకటించారు. రాజీనామా చేసిన 22 మంది నేతలంతా ఇండియా కూటమికి మద్దతు ఇస్తారని సీనియర్ నేత సతీశ్ కుమార్ వెల్లడించారు.

ఎన్నికల టైంలో చిరాగ్ పాశ్వాన్‌ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని అసంతృప్త నేతలు ఫైర్ అయ్యారు. బిహార్ ప్రజలకు చిరాగ్ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఇక రాజీనామా చేసిన మిగతా నేతలు కూడా చిరాగ్‌పై నిప్పులు చెరుగుతున్నారు. చిరాగ్ పాశ్వాన్ అన్ని లోక్‌సభ టికెట్లను అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ''బయటి వ్యక్తులకు టికెట్లు ఎందుకిచ్చారు ? పార్టీలో సమర్థవంతులు లేరా?'' అని చిరాగ్‌ను ఎల్‌జేపీ మాజీ ఎంపీ రేణు కుష్వాహ ప్రశ్నించారు. పార్టీలో కూలీలుగా పని చేయడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. ఎంపీ టికెట్లు కేటాయించే సమయంలో పార్టీ సీనియర్ నేతలతో చిరాగ్ కనీసం సంప్రదింపులు జరపలేదన్నారు.

మాజీ మంత్రి రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, ఎల్‌జేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ కుమార్, రవీంద్ర సింగ్, అజయ్ కుష్వాహ, సంజయ్ సింగ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ డాంగి తదితరులు ఈ అసంతృప్త నేతల బృందంలో ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లోని కీలకమైన హజీపూర్ స్థానం నుంచి బరిలో నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story