Road Accident: క్రూజర్, కంటైనర్ ఢీ.. నలుగురు మృతి.. ఆరుగురికి తీవ్ర గాయాలు

మహారాష్ట్ర సొలాపూర్ జిల్లాలోని పంఢరపూర్–మంగళవేధ మార్గంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవేధ సమీపంలో ఓ క్రూజర్ జీప్‌ను ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ముంబై–థానే ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు సెలవుల సందర్భంగా యాత్రకు బయల్దేరారు. తుల్జాపూర్, అక్కలకోట ఆలయాల్లో దర్శనాల అనంతరం పంఢరపూర్ మీదుగా డోంబివళి (ముంబై)కి తిరుగు ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్నవారంతా డోంబివళి నివాసులేనని సమాచారం. సోమవారం రాత్రి మంగళవేధ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన తీవ్రత ఎక్కువగా ఉండటంతో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే మంగళవేధ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో సహాయక చర్యలు ప్రారంభించారు. అంబులెన్స్‌ల ద్వారా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా పంఢరపూర్–మంగళవేధ రహదారిపై రెండు వైపులా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను తొలగించిన తర్వాత ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా అతివేగం మరియు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగా, వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే పనిలో పోలీసులు ఉన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
