Rajya Sabha : సోనియా గాంధీకి సీఎం రేవంత్ శుభాకాంక్షలు

రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభకు(Rajya Sabha) ఏకగ్రీవంగా ఎన్నికైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి (Sonia Gandhi) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారిగా ఆమె పెద్దల సభకు ఎన్నిక కావడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషిస్తారని, ఇది కాంగ్రెస్ పార్టీకి శుభ పరిణామమని పేర్కొన్నారు. సోనియా గాంధీ రాజ్యసభలో ఎంట్రీతో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైనట్లేనని ట్విట్టర్ వేదికగా రేవంత్
అభిప్రాయపడ్డారు.
'తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి... నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి... తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన సోనియమ్మ రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున ఆ తల్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు' అని ట్వీట్ చేశారు. సోనియాను కలిసిన ఫోటోను సీఎం రేవంత్ ట్విట్టర్ ఎక్స్ ఖాతాకు జత చేశారు.
కాగా, ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి సోనియాను పోటీకి దించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావించారు. సోనియా తెలంగాణ నుంచి పోటీలోకి దిగనున్నారని వార్తలు సైతం ప్రచారం అయ్యాయి. తాజాగా సోనియా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇక ఆ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టినట్లయింది. రాయ్ బరేలీ నుంచి ఆరు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన సోనియా గాంధీ.. తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com