Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు

Supreme Court : 16 రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సమన్లు
X

రెండో నేషనల్‌ జ్యుడిషియల్‌ పే కమిషన్‌’ (ఎస్ఎన్‌జేపీసీ) సిఫార్సులను అమలు చేయని 16 రాష్ట్రాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఆర్థికశాఖ కార్యదర్శులు ఆగస్టు 23న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని సమన్లు ఇచ్చింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టింది. కోర్టు సహాయకునిగా (అమికస్‌ క్యూరీ) వ్యవహరిస్తున్న న్యాయవాది కె.పరమేశ్వర్‌ ఇచ్చిన నివేదికను ధర్మాసనం పరిగణనలో తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, ఒడిశా, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు సర్వోన్నత న్యాయస్థానం సమన్లు జారీ చేసింది.

పదవీవిరమణ పొందిన జ్యుడిషియల్‌ అధికారులకు పే కమిషన్‌ సిఫార్సుల మేరకు పింఛను బకాయిలు, ఇతర ప్రయోజనాలు కల్పించడంలో ఈ రాష్ట్రాల అలసత్వం, వివిధ భత్యాలపై మూలం వద్ద పన్ను మినహాయింపుపై అసహనం వ్యక్తంచేసింది. ఎలా చేయించాలో మాకు తెలుసు ‘ఈ పనిని ఇప్పుడెలా చేయించాలో మాకు తెలుసు. ప్రమాణపత్రం దాఖలు చేయకపోతే ప్రధాన కార్యదర్శి హాజరుకావాలని మేం చెప్పినంత మాత్రాన అది దాఖలు కాదు. మేం వారిని జైలుకు పంపడం లేదు. వారు ఇక్కడకు వస్తే ప్రమాణపత్రం కూడా వస్తుంది. ఏడు అవకాశాలిచ్చినా పూర్తిస్థాయిలో అమలు చేయడంలో అనేక రాష్ట్రాలు విఫలమయ్యాయి. ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక కార్యదర్శులు వ్యక్తిగతంగా రాకపోతే ధిక్కరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది’ అని సీజేఐ ధర్మాసనం హెచ్చరించింది.

Tags

Next Story