Heatwave Cases : మార్చి 1 నుంచి 16,344 వడదెబ్బ కేసులు.. 60 మరణాలు

ఈ వేసవిలో కొన్నిచోట్ల వర్షాలు పడుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి 1 నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16,344 వడదెబ్బ కేసులు నమోదు కాగా.. 60 మంది ప్రాణాలు కోల్పోయారని నేషనల్ సెంటర్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ నివేదిక తెలిపింది. రాజస్థాన్‌లోని బార్మర్‌లో గురువారం 48.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత ఇదే.
గురువారం ఐఎండీ ఓ వాతావరణ హెచ్చరిక జారీ చేస్తూ... మే 24 – 27 మధ్య రాజస్థాన్, విదర్భ, మధ్యప్రదేశ్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో, హరియాణ, ఛండీగఢ్, ఉత్తర్ ప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతం, ఢిల్లీలో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా పెరిగిన వేడిగాలుల నేపథ్యంలో వడదెబ్బ, ఊపిరితిత్తులు, జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య 30 శాతం పెరిగిందని వైద్యులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా, రాజస్థాన్‌లోని ఫలోడీ గ్రామంలో శుక్రవారం 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వర్షాలతో ఇటీవల చల్లబడిన తెలంగాణలో ఎండలు మళ్లీ మండిపోతున్నాయి. నిన్న చాలా జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌లో 44.9, హాజీపూర్‌లో 44.5, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com