Big Tiger Zeenat : అటవీ అధికారులకు చిక్కిన ఆడపులి జీనత్

ఆడపులి జీనత్ ఎట్టకేలకు అటవీ అధికారులకు చిక్కింది. టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఈ ఆడ పులి.. అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. 21 రోజుల్లో మూడు రాష్ట్రాల్లో 300 కిలోమీటర్ల మేర ప్రయాణించింది. చివరికి పశ్చిమ బెంగాల్‌లో చిక్కింది. మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి మూడేళ్ల వయసున్న ఆడ పులి జీనత్ ని ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అయితే, డిసెంబరు 8న ఆ పులి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకుని.. పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది. ఒక వారం పాటు ఝార్ఖండ్‌లో సంచరించిందని సమాచారం. అనంతరం పశ్చిమ బెంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఆ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బంకురా జిల్లాలోని గోసైందిహి ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించారు. పులిని పట్టుకోవడంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అటవీ అధికారులను మెచ్చకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com