Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. భారత్‌లోని ధరలపై ప్రభావం..

Ukraine Russia: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం.. భారత్‌లోని ధరలపై ప్రభావం..
Ukraine Russia: ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల ఉన్న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తోంది.

Ukraine Russia: ఎక్కడో వేల కిలోమీటర్ల అవతల ఉన్న రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేస్తోంది. అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంటే మనకేంటిలే అని గమ్మున కూర్చునే పరిస్థితి లేదు. రష్యా వార్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి జీవితాలపైనా ప్రభావం చూపుతుంది. మన దగ్గరేం బాంబులు పడవు, మిస్సైల్స్ పేలవు, ఒక్క చుక్క రక్తం కారదు. కాని, ప్రతి ఒక్కరి ఇంట్లో అంతకు మించిన విధ్వంసాన్నే సృష్టిస్తుంది.

ఖర్చులు పెరుగుతాయి, జేబులు ఖాళీ అవుతాయి, మార్కెట్‌కు తీసుకెళ్తున్న డబ్బులకు, ఇంటికి తీసుకొస్తున్న సరుకులకు అసలు పొంతనే ఉండదు. ఓవరాల్‌గా ధరల భారంతో బతుకు గడవడమే భారంగా మారుంది. ఒక విధంగా ఇది ఎవరూ తప్పించుకోలేని విపత్తు. అదెలా అంటారా.. ఆ వివరాలు ఇప్పుడు వివరిస్తాం. రష్యా యుద్ధం కారణంగా ముడి చమురు ధర ఒకానొక దశలో 140 డాలర్లను టచ్ చేసింది.

అంటే దాదాపు 14 ఏళ్ల తరువాత ఆ రికార్డును చెరిపేసింది. బండిలో పోయించుకునే పెట్రోల్, డీజిల్‌ ఉత్పత్తిలో 12 శాతం రష్యా నుంచే వస్తోంది. ప్రపంచంలోనే క్రూడాయిల్‌ను ఉత్పత్తి చేసి, దాన్ని సరఫరా చేసే దేశాల్లో రష్యా మూడో స్థానంలో ఉంది. సాధారణ రోజుల్లో రష్యా 50 లక్షల బ్యారెళ్ల ముడిచమురును ఉత్పత్తి చేస్తుంది. యుద్ధం కారణంగా క్రూడ్‌ సరఫరాలో అడ్డంకులు ఏర్పడ్డాయి.

రష్యా రోజుకు ఉత్పత్తి చేసే 50 లక్షల బ్యారెళ్ల చమురు మార్కెట్లోకి రాకపోతే ఏమవుతుందిలే అనుకోవచ్చు. కాని, ఇది తేలిగ్గా తీసిపారేసే విషయం కాదు. యుద్ధం మొదలుకాక ముందు 80 డాలర్ల వద్ద ఉన్న బ్యారెల్ క్రూడ్ ధర.. ఫిబ్రవరి 24వ తేదీన.. అంటే యుద్ధం మొదలైన రోజున ఏకంగా 105 డాలర్లను దాటింది. ఆరోజు గత ఎనిమిదేళ్లలో చూడనంత స్థాయికి క్రూడాయిల్ ధర పెరిగింది.

అంతటితో ఆగలేదు. ఇదే క్రూడ్ ప్రైస్‌ 140 డాలర్లను తాకింది. భారత్‌లో క్రూడాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రమే. ప్రతిరోజు కొన్ని వేల బ్యారెళ్ల ముడిచమురు కొనుక్కోవాల్సిందే. పైగా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పడిపోయింది. ఒక్క డాలర్‌కు అటుఇటుగా 77 రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఈ లెక్కన ముడిచమురు కొనాలంటే ఆ భారం సామాన్యుడు మోయాల్సిందే.

ముడిచమురును అత్యధిక ధర పెట్టి కొనే రిఫైనరీలు.. ఆ ధరాభారాన్ని ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలపై వేస్తాయి. అంటే ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, భారత్‌ పెట్రోల్‌ లాంటివన్న మాట. రిఫైనరీల నుంచి ఎక్కువ ధరకు ఆయిల్‌ కొంటున్నాయి కాబట్టి.. ఆ భారాన్ని సామాన్యులపై వేస్తాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 108 రూపాయలు ఉంది.

ఇప్పటికిప్పుడు 12 నుంచి 15 రూపాయల వరకు పెట్రోల్ ధర పెంచాల్సిన అవసరం ఉందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటున్నాయి. కాని, ఇక్కడో విషయం తెలుసుకోవాలి. ప్రపంచ మార్కెట్లో క్రూడాయిల్ ధర 140 డాలర్ల వద్ద ఆగితేనే మన దగ్గర 15 రూపాయల వరకు పెట్రోల్ రేట్ పెరగొచ్చు. మరి 300 డాలర్లకు పెరిగితే? ఇండియాలో లీటర్ పెట్రోల్ 150 రూపాయలు దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాంటి పరిస్థితులు వస్తాయా అంటే.. కచ్చితంగా అవును అనే సమాధానం ఇస్తున్నారు.

సరే.. లీటర్ పెట్రోల్ 150 రూపాయలైంది. అంతమాత్రాన ఏం జరుగుతుంది? మన గడప దాటి లోపలికి వచ్చే ప్రతి వస్తువూ ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా రావాల్సిందే. వాటర్ క్యాన్‌ను తెచ్చే ఆటో నుంచి పొద్దున్నే వచ్చే పాల ప్యాకెట్ వరకు, వంటింటి నూనె నుంచి ఇతరత్రా సరుకుల వరకు.. కూరగాయల నుంచి చికెన్, మటన్‌ వరకు అన్నీ ట్రాలీల్లోనో, ట్రక్కుల్లోనో రావాల్సిందే.

పెట్రోల్ డీజిల్ ధర ఎకాఎకిన 40 రూపాయలకు పైగా పెరిగి, లీటర్‌ పెట్రోల్ 150కి చేరితే.. నీళ్ల క్యాన్, పాల ప్యాకెట్, కూరగాయలు, ఇతరత్రా సరుకులు పెరగవంటారా? జస్ట్ ఆటో ఎక్కి దిగినందుకు 30 రూపాయలు ఛార్జ్ చేయరంటారా? చివరికి ఆర్టీసీ సైతం ఆ భారాన్ని సామాన్యులపై వేయవంటారా? ఇక కార్, బైక్ ఉన్నోళ్లైతే.. నెలలో ఐదారు వేలు కేవలం పెట్రోల్, డీజిల్ కొనేందుకే ఖర్చు పెట్టాలి. ఇది ఇళ్ల ముంగిటకు వచ్చిన యుద్ధం కాదంటారా?

అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర పెరిగితే మనదేశంలో ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది. క్రూడాయిల్‌ పది డాలర్లు పెరిగితే భారత్‌లో అరశాతం ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఆర్‌బీఐ చెబుతోంది. పండ్లు, కూరగాయలు, ఉప్పు, పప్పుల ధరలు పెరగడమే ద్రవ్యోల్బణం. అంటే, ఉక్రెయిన్‌ వినాశనం ప్రతి ఇంట్లోనూ ధరల విధ్వంసాన్ని సృష్టించడం ఖాయం.

ఉక్రెయిన్‌పై పడే ప్రతి బుల్లెట్‌.. మనదేశంలో కూరగాయలు, నూనెల ధరలను పెంచుతుంది. అక్కడ పడే ఒక్కో బాంబ్‌ మన దగ్గర పెట్రో బాంబ్‌గా మారుతుంది. ఇప్పటికే, పెట్రోల్ డీజిల్ ధరలను భరించలేకపోతున్నారు జనం. ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లక తప్పదు కాబట్టి, అందుకోసం సొంత వాహనమో, ప్రయాణమో తప్పదు కాబట్టి.. ఇతరత్రా అవసరాలు తగ్గించుకుని పెట్రోల్‌ డీజిల్‌కు, ప్రయాణాలకు ఖర్చు పెడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో ఇంధన ధరలు ఇంకా ఇంకా పెరిగితే ఖర్చులు తగ్గించుకోవడం కాదు.. సామాన్యులు అప్పులు చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధర ఆకాశాన్నంటుతోంది. సన్‌ఫ్లవర్‌ ఉత్పత్తి, సరఫరాలో ఉక్రెయిన్, రష్యానే కీలకం. దాదాపు 70 శాతం సన్‌ఫ్లవర్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం.

రష్యా నుంచి ఏడాదికి 2 లక్షల టన్నులు, ఉక్రెయిన్‌ నుంచి ఏటా లక్షా 70వేల టన్నుల సన్‌ఫ్లవర్‌ను దిగుమతి చేసుకుంటున్నాం. కాని, నల్లసముద్రం మీదుగా ఎటువంటి షిప్పింగ్ జరగడం లేదు. ఉక్రెయిన్‌కు ఆయువు పట్టుగా ఉన్న మరియుపోల్, ఒడెస్సా ఓడరేవులను రష్యా చేజిక్కించుకుంది. దీంతో ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు షిప్పులు రావడం లేదు.

రిపోర్ట్స్‌ ప్రకారం 3 లక్షల 80వేల టన్నుల సన్‌ఫ్లవర్‌ దిగుమతి ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. అంటే, ఇకపై వంటనూనె కొనాలంటేనే చేతులు కాలిపోతాయన్న మాట. చివరికి ఆన్‌లైన్‌ ఫుడ్ ఆర్డర్స్‌ ధరలు కూడా బీభత్సంగా పెరగబోతున్నాయి. మొక్కజొన్న, గోధుమల సరఫరాలోనూ ఉక్రెయిన్‌, రష్యానే టాప్. అదృష్టవశాత్తు మొక్కజొన్న, గోధుమల విషయంలో మనం దిగుమతులపై పెద్దగా ఆధారపడడం లేదు కాబట్టి అంతవరకూ సేఫ్. లేదంటే ఆ ధరాభారం కూడా మోయాల్సి వచ్చేది.

బంగారం గురించి చెబితే ఆడవాళ్ల గుండెలు గుబేల్‌మనొచ్చు. యుద్ధం కారణంగా ఔన్స్‌ బంగారం ధర 2వేల 15 డాలర్లను టచ్‌ చేసింది. ఈమధ్య కాలంలో చూడని ప్రైస్ ఇది. దీనికారణంగా పది గ్రాముల బంగారం కొనాలంటే కనీసం 60వేల రూపాయలు చేతిలో పెట్టుకోవాల్సిందే. అది కూడా యుద్ధం ఆగితేనే. లేదంటే బంగారం ధర ఎంతకు పోతుందో చెప్పలేమంటున్నారు బులియన్ వ్యాపారులు.

ఒక దేశం మరో దేశంపై యుద్ధం చేస్తే ప్రపంచానికి ఎంత సంకటంగా మారుతుందనే దానికి రష్యా చేస్తున్న యుద్ధమే ప్రత్యక్ష సాక్ష్యం. ముడిచమురు, బంగారం, విలువైన రత్నాలు, పొద్దుతిరుగుడు, గోధుమలు, మొక్కజొన్నలు, ఎరువులు, బొగ్గు, ఇతర ఖనిజాల ధరలు.. ఇలా ప్రతి ఒక్క ధర పెరుగుతోంది. ఇవన్నీ మన ఇళ్లలో వాడేవే, ఇంట్లోకి వచ్చే వస్తువుల కోసం ఉపయోగించేవే. అందుకే, యుద్ధం ఇతర దేశాలకు ప్రాణనష్టం కలిగించకపోయినా.. అంతకు మించి నష్టం సృష్టిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story