Delhi CM : కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందన

Delhi CM : కేజ్రీవాల్ అరెస్టుపై ఐక్యరాజ్యసమితి స్పందన

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టు, కాంగ్రెస్ (Congress) బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి అంశాలు, భారతదేశంలో రాజకీయ అశాంతిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఎన్నికలు జరిగే ఇండియా సహా ఇతర దేశాల్లో ప్రజల ‘రాజకీయ, పౌర హక్కులు’ రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని కనబరుస్తున్నట్టు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరెస్ అధికార ప్రతినిధి స్టెఫానే డుజారిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు ‘స్వేచ్ఛగా, న్యాయంగా’ ఓటు వేసే వాతావరణం ఉంటుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. కేజ్రీవాల్ అరెస్ట్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల స్తంభనతో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారత్‌లో నెలకొన్న ‘రాజకీయ అశాంతి’పై అడిగిన ప్రశ్నకు ఆయన పై విధంగా స్పందించారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత అరెస్ట్‌పై అమెరికా, జర్మనీలు చేసిన ప్రకటనలను అనుసరించి ఐక్యరాజ్యసమితి పలు వ్యాఖ్యలు చేసింది. కేజ్రీవాల్ అరెస్టును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, న్యాయమైన, పారదర్శకమైన, సమయానుకూల న్యాయ ప్రక్రియని ప్రోత్సహిస్తున్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ ప్రకటనపై భారతదేశం నిరసనను నమోదు చేస్తూ, న్యూఢిల్లీ సీనియర్ US దౌత్యవేత్తను పిలిపించింది. ఇది జరిగిన కొన్ని గంటల తర్వాత, బుధవారం, US అదే వైఖరిని పునరుద్ఘాటించింది. పారదర్శక, సమయానుకూల చట్టపరమైన ప్రక్రియలకు పిలుపునిచ్చింది.

లోక్‌సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన కేంద్ర దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నారు. ఇకపోతే ఆదాయపు పన్ను శాఖ వారి బ్యాంకు ఖాతాలను సీల్ చేసిందని, పార్లమెంటు ఎన్నికలలో పోరాడటానికి డబ్బు లేదని కాంగ్రెస్ ఆరోపించింది.

Tags

Read MoreRead Less
Next Story